: నోట్ల పాట్లు... తెల్లారితే పెళ్లి... పెళ్లికొడుకు ఏటీఎం వద్దే!
నోట్ల కోసం జనాలు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. నల్లధనం నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఓ వైపు సమర్థిస్తూనే... తమ బాధలను మరోవైపు వెళ్లగక్కుతున్నారు సామాన్యులు. తాజాగా, న్యూ ఢిల్లీలో ఓ కుటుంబం పడిన వేదన ఎవరికైనా 'అయ్యో' అనిపించకమానదు. సాధారణంగా ఎవరింట్లో అయినా పెళ్లి ఉంటే... అందరూ ఇంటి వద్దే ఉంటూ, కులాసాగా గడిపేస్తుంటారు. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. వీరి ఇంట్లో తెల్లారితే పెళ్లి. కానీ, పెళ్లి ఖర్చులకు డబ్బులు చేతిలో లేకపోవడంతో... పెళ్లికొడుకుతో పాటు, అతని ఇద్దరు సోదరులూ అర్ధరాత్రి నుంచి ఈ ఉదయం వరకు ఏటీఎం సెంటర్ వద్దే గడిపారు. పెళ్లి సమయంలో తనకు ఈ బాధలు ఏంటో అని జాతీయ మీడియా వద్ద వరుడు సునీల్ వాపోయాడు. డబ్బు కోసం ఏటీఎం సెంటర్ల వద్ద తన కుటుంబ సభ్యులంతా ఎంతో కష్టపడ్డామని... అయినా తగిన ఫలితం మాత్రం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.