: నా మాటలను తేలిగ్గా తీసుకుంటే సహించే ప్రసక్తే లేదు.. పోలవరం సమీక్షలో చంద్రబాబు హెచ్చరిక


పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో తన మాటలను తేలిగ్గా తీసుకుంటే ఇబ్బందులు పడక తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను హెచ్చరించారు. పద్ధతి మార్చుకోకుంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై సోమవారం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న అలసత్వంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రాజెక్టు సీఈ రమేశ్ బాబును ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘ఏం రమేశ్ బాబు.. ఇక్కడ గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నావా? కాంట్రాక్టు సంస్థలు ఏమేరకు పనిచేస్తున్నాయో సమీక్షించాల్సిన పనిలేదా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని యంత్రాలు ఇంకా రావాల్సి ఉందన్న రమేశ్ బాబు వ్యాఖ్యలను సీఎం పట్టించుకోలేదు. జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌పైనా చంద్రబాబు మండిపడ్డారు. ‘‘నువ్వేదో బాగా పనిచేస్తావనుకుని కీలకమైన జలవనరుల శాఖ కార్యదర్శి బాధ్యతలు అప్పగించా. కానీ ఏం బాగాలేదు. నువ్వు అప్ టు ది మార్క్‌గా లేవు. యు షుడ్ కమ్ డౌన్ టు ది ఎర్త్. వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రయత్నించండి. లేకపోతే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది" అని హెచ్చరికలు జారీ చేశారు. ఈ సమయంలో వాతావరణాన్ని చల్లబరిచేందుకు ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు ప్రయత్నించారు. గతంతో పోలిస్తే ప్రాజెక్టు పనుల్లో పురోగతి ఉందని చెప్పారు. దీంతో ముఖ్యమంత్రి ఆయనపైనా మండిపడ్డారు. తనకు కావాల్సింది పురోగతి కాదని, రిజల్ట్ అని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నా పనులు మాత్రం ఆశించిన స్థాయిలో జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్యాన్ని సకాలంలో పూర్తిచేసి వారిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News