: హైదరాబాద్‌లో మద్యం మత్తులో యువతి హల్‌చల్.. నడిరోడ్డులో మహిళ చెంప కొరికి.. గొంతు నులిమి వీరంగం
మద్యం మత్తులో ఓ యువతి నడిరోడ్డుపై హల్‌చల్ చేసింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై రాళ్లు రువ్వింది. మరో మహిళ చెంప కొరికి, గొంతు నులిమి గాయపరిచింది. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డు ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. జనం చోద్యం చూడడం తప్ప ఏమీ చేయలేకపోయారు. సోమవారం మద్యం మత్తులో ఉన్న ఓ యువతి రహదారికి అడ్డంగా నిలబడింది. వాహనదారులను అడ్డుకునే ప్రయత్నం చేసింది. వాహనాలపైకి రాళ్లు విసరడంతో కొన్ని వాహనాల అద్దాలు భళ్లుమన్నాయి. ఆ తర్వాత ఆ పక్కనే రోడ్డుపై తినుబండారాలు విక్రయించే ఓ మహిళ వద్దకు వెళ్లి జుట్టుపట్టుకుని లాగింది. ఆపై గొంతు నులిమింది. అక్కడితో ఆగక చెంపను కొరికి తీవ్రంగా గాయపరిచింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన కొందరిని తిట్టిపోసింది. ఆమె చర్యలను జనం సినిమాలా తిలకించారు. కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి యువతిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ఫిర్యాదుతో యువతిని సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మత్తు దిగే వరకు అక్కడే ఉంచారు. అనంతరం వివరాలు తెలుసుకుని ఇంటికి పంపారు. మంగళవారం మళ్లీ స్టేషన్‌కు రావాలని ఆదేశించారు.