: కరెన్సీ కొరత నేపథ్యంలో.. లేటెస్టు పెళ్లి గిఫ్టు ఇదే!


దేశంలో వరుసగా వచ్చిన పుష్కరాల కాలం కొన్ని ప్రాంతాల్లో 'పెళ్లి కాని ప్రసాదు'లకు మొన్నటి వరకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఆ సమయం కాస్తా వెళ్లి సుముహూర్తాలు వచ్చాయి, ఇక ధూంధాంగా వివాహం చేసుకుందామని భావించేంతలో ప్రధాని మోదీ కరెన్సీని రద్దు చేశారు. దీంతో పెళ్లివారింట ‘నగదు కష్టాలు’ అలముకుంటే, ఈ పెళ్లిళ్లకు హాజరయ్యే బంధువులకు ‘బహుమతి బాధలు’ పట్టుకొన్నాయి. దీంతో పెళ్లిళ్లు సాదాసీదాగా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌ కు చెందిన పలువురు దీనికి సరికొత్త పరిష్కారాన్ని కనుగొన్నారు. మామూలుగా వివాహానికి హాజరైన దగ్గరి బంధువులు వధూవరులకు ఇచ్చే కానుకల్లో నగదు ఉండడం సర్వసాధారణం. పైకాన్ని కవర్లలో పెట్టి ఈ బహుమతులు అందజేస్తుంటారు. ఇప్పుడు కూడా అలాగే కవర్లు ఇస్తున్నారు. అయితే, ఆ కవర్లను విప్పి చూసిన పెళ్లి వారు మాత్రం షాక్ కు గురవుతున్నారు. దానికి కారణమేంటంటే...‘ఐ ప్రామీస్‌ టు పే ది బేరర్‌ ది సమ్‌ ఆఫ్‌ ఫైవ్‌ హండ్రెడ్‌ రూపీస్‌... అన్నట్టు మీకిదే నా హామీ. డబ్బులు చేతికందగానే మీకివ్వాల్సిన మొత్తానికి సంబంధించిన నగదు బహుమతి నవంబర్‌ లేదా డిసెంబర్‌ చివరి కల్లా అందజేస్తాను.. మా వద్ద డబ్బులు లేకపోవడంతోనే అలా చేస్తున్నాం. దయచేసి ఏమనుకోకండి’ అని ముద్రించిన పత్రాలు దర్శనమిస్తున్నాయి. కొంత మంది పాత నోట్లనే వివాహ మహోత్సవాల్లో అందజేస్తుండగా, ఇంకొందరు మాత్రం ఈ సరికొత్త విధానం అమలు చేస్తున్నారట. దీంతో ఈ కవర్లు తీసుకుని ఏం చేయాలో అర్థం కాక పెళ్లి వారు తలపట్టుకుంటున్నారు.

  • Loading...

More Telugu News