: పెద్ద చందమామను చూశారా?...మళ్లీ ఓసారి చూడండి!


చందమామను చూశారా?... నిండుపున్నమి వెన్నెల్లో చందమామను చూస్తే కలిగే ఆనందమే వేరు. సోమవారం...కార్తీక పౌర్ణమి రోజున నీలాకాశంలో నిండు చందమామ ప్రకాశవంతంగా కనువిందు చేస్తోంది. కావాలంటే ఓ సారి అలా బయటకు వెళ్లి ఓసారి ఆకాశంలో సూపర్‌ మూన్‌ ను చూడండి. సాదారణంగా చంద్రుడు దీర్ఘవృత్తాకారంలో భూమి చుట్టూ పరిభ్రమిస్తుంటాడు. దీని వల్ల కొన్ని సార్లు భూమికి దగ్గరగా వస్తుంటాడు. ఇలా చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చే కేంద్రాన్ని ‘‘పెరిగీ’’ అని, దూరంగా వెళ్లే కేంద్రాన్ని ‘‘అపోగీ’’ అని అంటారు. ఈ రెండు కేంద్రాల మధ్య దూరం 30 వేల కిలోమీటర్లు. భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న ఈ మొత్తం దూరంలో ఇది 14 శాతం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల, ‘అపోగీ చంద్రుడు’ 14 శాతం చిన్నగా, ‘పెరిగీ చంద్రుడు’ 14 శాతం పెద్దగా కనిపిస్తాడు. దీంతో నేడు సూపర్‌ మూన్ (పెరిగీ చంద్రడు) ‘అపోగీ చంద్రుడి’ కన్నా 14 శాతం పెద్దగా కనిపిస్తున్నాడు. సాధారణ చంద్రుడి కంటే 30 శాతం ప్రకాశవంతంగా, మామూలుగా వచ్చే పున్నమి చంద్రుడి కన్నా 7 రెట్లు పెద్దగా, 7 రెట్లు ప్రకాశవంతంగా కనిపిస్తున్నాడు. 1948లో ఇలా నిండు చంద్రుడు గతంలో కనువిందు చేయగా, సరిగ్గా 69 ఏళ్ల తరువాత చంద్రుడు భూమికి అతి దగ్గరగా వచ్చాడు. మళ్లీ ఈ అద్భుతాన్ని 2034లో చూసే అవకాశం ఉన్నప్పటికీ, సూపర్ మూన్ ను మళ్లీ చూసే అవకాశం మాత్రం 2052 నాటికి కానీ రాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో మళ్లీ ఈ అవకాశం వస్తుందో రాదోనన్న ఆలోచనతో పెద్ద నిండు చంద్రుడ్ని చూసేందుకు అంతా ఉత్సాహం చూపిస్తున్నారు. పిల్లలను తీసుకుని పెద్దలు వైజాగ్ బీచ్ కు క్యూకట్టగా, హైదరాబాద్‌ సంజీవయ్య పార్కులో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందమైన, కాషాయ వర్ణంలో ప్రత్యేకంగా కనువిందు చేస్తోంది. ఇప్పటికే చూసి ఉంటే సరే...లేకపోతే బయటకు వెళ్లి సూపర్‌ మూన్‌ ను మీరు కూడా చూసి ఆస్వాదించండి.

  • Loading...

More Telugu News