: ‘పెద్దనోట్ల రద్దు’ రద్దై పోవాల్సిందే.. మమతా బెనర్జీ ఆధ్వర్యంలో రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీకి సన్నాహాలు
దేశాన్ని పట్టి పీడిస్తోన్న నల్లధనాన్ని, నకిలీ నోట్లను నిరోధించడానికి ప్రధాని నరేంద్ర మోదీ పెద్దనోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతిపక్షాలతో కలిసి పోరాటం జరపడానికి సిద్ధమయ్యారు. ఆయా పార్టీల ముఖ్య నేతలతో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ అంశంపైనే ప్రతిపక్షాలు గళం విప్పనున్నాయి. మమతా బెనర్జీ రేపు ఢిల్లీకి వెళ్లి, అక్కడ ప్రతిపక్ష పార్టీలకు చెందిన సుమారు 100 మంది ఎంపీలతో కలిసి చర్చించనున్నారు. అనంతరం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే బుధవారం రోజు పార్లమెంట్ భవనం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. పెద్ద నోట్ల రద్దును రద్దు చేయాల్సిందేనని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వారంతా కలిసి వినతి పత్రం అందించనున్నట్లు తృణమూల్ నేతలు చెప్పారు.