: ఐసిస్ లో భారతీయ మహిళ ఉన్నట్లు విచారణలో తెలిపిన పట్టుబడ్డ ఉగ్రవాది
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో ఓ భారతీయ మహిళ కూడా ఉన్నట్లు ఇటీవల పట్టబడిన ఓ ఉగ్రవాది చెప్పాడు. ఇస్లామిక్ స్టేట్ ప్రేరణతో భారత్‌లో దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న ఓ కేసులో దర్యాప్తు జరుపుతున్న ఎన్ఐఏ అధికారులు తమిళనాడుకు చెందిన 31 ఏళ్ల సుబహానిని గత నెల 6వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. సుబహాని ఐఎస్ఐఎస్ తరపున మోసుల్‌లో పోరాటంలో పాల్గొన్నాడు. అతను శివకాశి నుంచి పేలుడు పదార్థాలను సరఫరా చేస్తుండగా పట్టుబడ్డాడు. దీంతో అతడిని విచారిస్తోన్న అధికారులకు పలు విషయాలు చెప్పాడు. తాను ఇస్లామిక్ స్టేట్ యుద్ధ భూమిలో ఉన్నప్పుడు మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ, ఒక పురుషుడు కనిపించారని సుబహాని చెప్పాడు. తాను సదరు మహిళతో మాట్లాడానని కూడా చెప్పాడు. ఇస్లామిక్ స్టేట్‌లో భారతీయ మహిళలు ఉన్నట్లు ఇంతవరకు సమాచారం లేదని, తాజాగా పట్టుబడ్డ ఉగ్రవాది అక్కడ ఓ భారతీయ మహిళ ఉన్నట్లు చెప్పాడని అధికారులు పేర్కొన్నారు.