: పన్ను ఎగ్గొట్టిన వారు నిద్రమాత్రలు వేసుకుంటున్నారు: ప్రధాని మోదీ
పన్ను ఎగ్గొట్టిన వారికి ఇప్పుడు నిద్రపట్టడం లేదని, పేదలు ప్రశాంతంగా నిద్రపోతోంటే వారు మాత్రం నిద్రమాత్రలు వేసుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లోని ఘజీపూర్ లో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ... మనకు డబ్బుకు కొదవలేదని, కాకపోతే అది ఉండాల్సిన చోట ఉండట్లేదని, దేశంలో అవినీతికి చోటు ఉండకూడదని అన్నారు. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీ 19 నెలలు మొత్తం దేశాన్నే ఇబ్బందుల్లో పెట్టిందని, ఎంతో మంది సామాన్యులను జైల్లో పెట్టిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు నోట్ల రద్దు తరువాత కొన్ని పార్టీలకు పెద్ద సమస్య వచ్చిందని చెప్పారు. తనకు ప్రత్యర్థులుగా ఉన్నవారు ఎంతో బలమైన వారని తాను ఒప్పుకుంటున్నట్లు, అయితే, వారికి తాను ఎన్నటికీ భయపడబోనని మోదీ అన్నారు. మన శత్రుదేశం నకిలీ నోట్లను ముద్రించి, పంపుతోందని అన్నింటినీ అరికడుతున్నానని చెప్పారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను వెనక్కి తగ్గబోనని ఉద్ఘాటించారు. పేదల కోసమే తమ ప్రభుత్వమని తేల్చిచెప్పారు. అవినీతిపరులు మాత్రమే ఇప్పుడు ఆందోళన చెందుతున్నారని, తమ నల్లధనం అంతా నాశనమవుతుందని వారు ఆందోళనలో ఉన్నారని మోదీ వ్యాఖ్యానించారు.