: నెహ్రూ ఈ ప్రాంతానికి అన్యాయం చేశారు.. నేను న్యాయం చేస్తా: ఘజీపూర్ లో ప‌్రధాని మోదీ
ఉత్తరప్రదేశ్‌లోని ఘజీపూర్ లో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ రోజు మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ 1965లో పాకిస్థాన్‌కి బుద్ధి చెప్పిన అబ్దుల్ హమీద్ జన్మించిన ఘజీపూర్ భూమికి తాను సెల్యూట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. నెహ్రూ ఈ ప్రాంతానికి అన్యాయం చేశారని, తాను న్యాయం చేస్తానని ప‌్రధాని మోదీ అన్నారు. యూపీ నుంచి ఎంతో మంది ప్రధానులు అయ్యారని, అయినా అక్కడ తగిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని చెప్పారు. ఇప్పటికీ అక్కడి ఎంతో మంది ప్రజలు పేదరికంతో అల్లాడుతున్నారని అన్నారు. పూర్వాంచల్ అభివృద్ధికి నెహ్రూ వేసిన కమిటీ నివేదికలు, ప్రణాళికలు అమలు కాలేదని విమర్శించారు. ఈ రోజు నెహ్రూజీ పుట్టినరోజు సందర్భంగా ఆ ప్రాంత అభివృద్ధికి ఆనాడు రూపొందించిన ఫైళ్లు రీ ఓపెన్ చేసి ఓ సారి కాంగ్రెస్ నేతలు చూసుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ కుటుంబ సభ్యులు తనపై ఎన్నో విమర్శలు చేస్తున్నారని మోదీ అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో పేదలు ప్రశాంతంగా నిద్రపోతున్నారని అన్నారు. నెహ్రూ కుటుంబ సభ్యులు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తాను పెద్ద నోట్ల రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో పన్ను ఎగవేత దారులు ఎంతో భయపడుతున్నారని చెప్పారు. పేదలు ప్రశాంతంగా నిద్రపోతున్నారని, నల్లకుబేరులకు నిద్రపట్టడంలేదని అన్నారు.