: ఉప్పు కొరత అంటూ వస్తోన్న వదంతుల వెనుక వ్యాపారుల భారీ కుట్రే ఉంది!
దేశంలో ఉప్పుకొరత ఏర్పడిందని, వినియోగదారులు వందలు చెల్లిస్తేనే ఒక్క ఉప్పు ప్యాకెట్ వస్తుందని.. ఇలా గత రెండు రోజులుగా ఎన్నో పుకార్లు పెద్ద ఎత్తున షికార్లు చేస్తోన్న సంగతి తెలిసిందే. దేశంలో కావలసినంత ఉప్పు ఉన్నప్పటికీ రద్దయిన పెద్ద నోట్ల ప్రభావంతో ఏర్పడిన పరిణామాలను ఆసరాగా తీసుకొని తమకు అధిక లాభార్జనే లక్ష్యంగా ఉప్పు వ్యాపారులు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇటువంటి వారిపై నిఘా పెట్టిన పోలీసులు తాజాగా పలువురిని అరెస్టు చేశారు. ఇప్పటివరకు నలుగురిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుత పరిణామాలను ఉపయోగించుకొని వారు పెద్ద ప్లానే వేసినట్లు తెలిసింది. ఒక కూటమిగా ఏర్పడిన వ్యాపారులంతా కలిసి ప్లాన్ ప్రకారం ఇటువంటి వదంతులను వ్యాపింపజేస్తున్నారు. ఉప్పు మాత్రమే కాక నిత్యావసర వస్తువులను గోడౌన్లలో నిల్వచేయాలని చూస్తున్నట్లు సమాచారం. వారి ప్లాన్‌లో భాగంగానే ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న కొద్ది పాటి ఉప్పు కొరతపై దేశ వ్యాప్తంగా విపరీతంగా వదంతులు సృష్టిస్తున్నారు. నోటి మాట ద్వారానూ, సామాజిక మాధ్యమాల ద్వారానూ కేవలం రెండుమూడు గంటల సమయంలోనే ప్రచారం చేసుకున్నారు. వీటి ఫలితంగానే రూ.18 కి అమ్మాల్సిన ఉప్పుప్యాకెట్ రూ. 200లకు అమ్ముతున్నారు. దుకాణాల్లో ఈ ప్యాకెట్లు కొనుగోలు చేసిన ఏజెంట్లు బయటి మార్కెట్లలో ఇంతకు రెట్టింపు ధరకు విక్రయించారు. అయితే, ఇది ఆరంభం మాత్రమే అనీ, ఇకపై కందిపప్పు, మినప్పప్పు, ఉల్లి ఇలా అన్ని నిత్యావసర వస్తువులపై పుకార్లు సృష్టించి సొమ్ముచేసుకోవాలని ప్లాన్ వేసినట్లు తెలిసింది. ఉప్పు కొరత అంటూ వచ్చిన వార్తలపై దర్యాప్తు జరిపిన పోలీసులు అవన్నీ వదంతులేనని తేల్చి, వారి సోదాల్లో లభించిన వివరాల ఆధారంగా మరింత మంది వ్యాపారుల వివరాలను సేకరిస్తున్నారు. అన్ని ఆధారాలు నిజమని స్పష్టమైతే వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.