: ముందస్తు సమాచారంతో చంద్రబాబు, కేసీఆర్ లబ్ధి పొందారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లకు ముందుగానే సమాచారం ఉందని... దీంతో వీరిద్దరూ లబ్ధి పొందారని చెప్పారు. ఈ అనుమానం ప్రజల్లో కూడా ఉందని తెలిపారు. ముందస్తు ఆలోచన లేకుండా, హడావుడిగా పెద్ద నోట్లను రద్దు చేశారని... దీంతో సామాన్యులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఉత్తమ్ కుమర్ రెడ్డి మండిపడ్డారు. ఈ రోజు అబిడ్స్ లోని నెహ్రూ విగ్రహం వద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి, దానం నాగేందర్, సుధీర్ తో పాటు, పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నోట్లను రద్దు చేస్తున్న అంశాన్ని తన అనుకూల ముఖ్యమంత్రులు, సన్నిహితులు, వ్యాపార సంస్థలకు ప్రధాని మోదీ ముందుగానే లీక్ చేశారని ఆరోపించారు. మరోవైపు, నిరసన చేస్తున్న కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.