: బ్యాంకులో అధిక డబ్బు డిపాజిట్ చేస్తే 200 శాతం జరిమానా ఎలా వీలవుతుంది?: సాధ్యం కాదంటున్న ఆదాయపు విభాగ నిపుణులు

పెద్ద నోట్లను రద్దు చేసిన తరువాత, ఏదైనా బ్యాంకు ఖాతాలో ఆదాయపు పన్ను పరిమితికి మించి డిపాజిట్లు చేసిన పక్షంలో జరిమానాగా 200 శాతం పన్ను మొత్తాన్ని విధిస్తామని కేంద్ర ప్రభుత్వం చేసిన హెచ్చరిక ఆచరణలో సాధ్యం కాదని ఆదాయపు పన్ను విభాగ నిపుణులు వ్యాఖ్యానించారు. బ్యాంకుల్లో డిపాజిట్లపై ఆటోమేటిక్ గా పన్ను విధించే అవకాశాన్ని దగ్గర చేసే చట్ట నిబంధన ఇండియాలో లేదని వెల్లడించారు. "లెక్కలోకి చూపని ఆదాయాన్ని పట్టుకుంటే జరిమానా విధించవచ్చు. కానీ, ఎవరైనా బ్యాంకులో ఓ కోటి రూపాయలు జమ చేసి, 33 శాతం పన్ను రూపంలో చెల్లించి, 2017-18 అసెస్ మెంట్ సంవత్సరానికి, టాక్స్ రిటర్నుల్లో దాన్ని చూపుతూ 'ఇన్ కం ఫ్రం అదర్ సోర్సెస్' అని ప్రస్తావిస్తే, సాంకేతికంగా అది స్వచ్ఛంద ఆదాయ వెల్లడే. ఈ నేపథ్యంలో జరిమానా కుదరదు. గత నాలుగు రోజులుగా, మేము ఎన్నో సమావేశాల్లో 200 శాతం జరిమానాపై చర్చించి, అది సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చాం" అని ఓ సీనియర్ అధికారి తెలిపారు. కాగా, 200 శాతం జరిమానా అంటే, దాదాపు మొత్తం డబ్బు ప్రభుత్వానికి చేరుతుంది. వాస్తవానికి ఈ ప్రకటన వచ్చిన తరువాత అక్రమంగా నల్లధనం దాచుకున్న వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. డబ్బు డిపాజిట్ చేస్తే, ఐటీ అధికారులు, సర్వీస్ టాక్స్ అధికారులు, చివరిగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తమను వేటాడుతుందని భయపడుతున్నారు. అందువల్లే తమ ఖాతాల్లోకి కాకుండా, వివిధ రకాల అక్రమ పద్ధతుల ద్వారా తమ నల్ల ధనాన్ని మార్చుకుంటున్నారు. ఇప్పుడు కూడా నల్లధనాన్ని దాచుకున్న వారు 33 శాతం పన్నుతో బ్యాంకుల్లో డిపాజిట్ చేయవచ్చని ఓ ప్రకటన చేసి, వారి వివరాలు బయటకు వెల్లడించబోమని ప్రకటిస్తే, నల్లధనంలో అత్యధిక మొత్తం వ్యవస్థలోకి వస్తుందని పలువురు ఐటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News