: మాయావతిపై పోటీకి బాలీవుడ్ భామ రాఖీ సావంత్!
వచ్చే ఏడాదిలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ఎన్నికల బరిలోకి జహుజన సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతి దిగితే... ఆమెపై సినీ నటి రాఖీ సావంత్ ను పోటీగా నిలబెడతామని ఆర్పీఐ (రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా) అధ్యక్షుడు, కేంద్ర సహాయ మంత్రి రామ్ దాస్ అథవాలే ప్రకటించారు. గత కొన్నేళ్లుగా మాయావతి తప్పించుకుని తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. ఈ ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా మాయావతి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ఎలక్షన్స్ లో మాయావతి ఎక్కడ నుంచి పోటీ చేస్తే అక్కడ నుంచి తమ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రాఖీ సావంత్ ను బరిలోకి దింపుతామని చెప్పారు. ప్రస్తుతం మాయావతి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. దళితుల మద్దతు ఎక్కువగా ఉన్న ఆర్పీఐ... బీజేపీతోనే పొత్తు పెట్టుకుంటుందని, లేని పక్షంలో సొంతంగా 200 స్థానాల్లో అభ్యర్థులను నిలబెడుతుందని చెప్పారు.