: ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ కాక్ పిట్ లో పొగలు... ఢిల్లీలో క్షేమంగా ల్యాండయిన లోహ విహంగం
కోల్ కతా నుంచి ఢిల్లీ వెళ్లుతున్న ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ విమానం కాక్ పిట్ లో పొగలు రావడంతో తీవ్ర భయాందోళనల నడుమ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో క్షేమంగా ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాక్ పిట్ లో పొగను గుర్తించిన అలారం మోగడంతో ముందు జాగ్రత్త చర్యగా విమానంలో విద్యుత్ సరఫరాను నిలిపివేసి, ఆపై విషయాన్ని గ్రౌండ్ కంట్రోల్ విభాగానికి చెప్పిన పైలట్, విమానాన్ని ల్యాండ్ చేశాడు. "పైలట్ తొలుత కాక్ పిట్ లో పొగలు చూశాడు. ఆపై ఏదో కాలుతున్న వాసన వచ్చింది. విమానం సిబ్బందితో పాటు ప్రయాణికులకూ ఆ వాసన వచ్చింది. అయితే, సమస్య కాక్ పిట్ కు మాత్రమే పరిమితమైంది" అని విమానంలో తీవ్ర ఆందోళనకు గురై, ఆపై క్షేమంగా బయటపడ్డ ప్రయాణికుడు ఒకరు తెలిపారు. విమానం ల్యాండ్ అయిన తరువాత, దాన్ని ఓ మూలకు నెట్టుకుంటూ వెళ్లి, సమస్య ఎక్కడ వచ్చిందన్న విషయాన్ని తేల్చేందుకు నిపుణులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై డీజీసీఏ అధికారులు విచారణ ప్రారంభించారు.