: వరుడిది విజయవాడ.. వధువుది పోలెండ్.. బెజవాడలో మూడుముళ్లతో ఒక్కటైన ప్రేమికులు
విజయవాడ వరుడు, పోలెండ్ అమ్మాయి బెజవాడలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. తెలుగు సంప్రదాయం ప్రకారం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగిన ఈ వివాహాన్ని చూసేందుకు కుటుంబ సభ్యులతోపాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. విజయవాడలోని విద్యాధరపురానికి చెందిన ఆదిత్య ఉద్యోగం కోసం బ్రిటన్ వెళ్లాడు. అక్కడ తనతోపాటు పనిచేస్తున్న పోలెండ్‌కు చెందిన ఆగ్నీష్‌కాను ప్రేమించాడు. విషయం తెలిసిన పెద్దలు వారి పెళ్లికి అంగీకరించారు. దీంతో ఆదివారం గాంధీనగర్‌లోని హోటల్ ఐలాపురంలో తెలుగు సంప్రదాయం ప్రకారం వారి వివాహం ఘనంగా జరిగింది. వివాహానికి వధువు తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. తమ అమ్మాయి తెలుగింటి కోడలు అయినందుకు సంతోషంగా ఉందని వధువు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశ సంస్కృతీసంప్రదాయాలు అంటే తమకు ఎంతో ఇష్టమని పేర్కొన్న వారు ఈ పెళ్లిని తమ జీవితంలో మరిచిపోలేమని పేర్కొన్నారు.