: మావోల వద్ద రూ. ఏడువేల కోట్లు.. మార్చుకునేందుకు పాట్లు.. అడ్డుకుంటామంటున్న పోలీసులు


పెద్ద నోట్ల రద్దుతో నల్లకుబేరులకే కాదు మావోయిస్టులకూ వణుకు మొదలైంది. డంపుల్లో పెద్ద ఎత్తున దాచుకున్న డబ్బును మార్చుకునేందుకు మార్గాన్వేషణ కోసం నక్సలైట్లు ప్రయత్నాలు మొదలెట్టారు. దీంతో వారి కార్యకలాపాలపై పోలీసులు నిఘా పెట్టారు. వారి వద్ద రూ.7 వేల కోట్లకు పైగానే నిధులు ఉన్నట్టు చెబుతున్నారు. ఆ నిధులను బస్తర్ ప్రాంత అడవుల్లో నిక్షిప్తం చేసి ఉంటారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. స్థానికులు, మద్దతుదారుల సాయంతో వాటిని మార్చుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్టు మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ ప్రత్యేక డీజీపీ డీఎం అవస్థి తెలిపారు. అయితే వారి ఆటలు సాగనిచ్చేది లేదని, డబ్బును మార్చుకోకుండా అడ్డుకుంటామని తెలిపారు. మూడు రోజుల క్రితం చత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత కొండగావ్ జిల్లాలో ఓ వ్యక్తి నుంచి పోలీసులు రూ.1000, రూ.500 నోట్లతో కూడిన రూ.44.24 లక్షల నగదు, రూ.2 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ సొమ్మును తరలిస్తున్న వ్యక్తి ఆధారాలు చూపించకపోవడంతో అదుపులోకి తీసుకున్నట్టు డీజీపీ తెలిపారు. డబ్బు మార్చుకునేందుకు మావోయిస్టులు చేసే అన్ని ప్రయత్నాలను అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వలేని మావోలు ఏటీఎంలు, బ్యాంకులు, పోస్టాఫీసులు వంటి ఆర్థిక సంస్థలపై దాడులు చేసే అవకాశం ఉండడంతో అప్రమత్తమైనట్టు అవస్థి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News