: నోట్ల రద్దుపై పోరాటం వద్దన్న కేసీఆర్.. మమతా బెనర్జీ ప్రయత్నంలో భాగం కాకూడదని నిర్ణయం


పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్రంపై పోరాటం వద్దని, నిర్ణయం అమలులో లోపాలను మాత్రమే ఎత్తి చూపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నిర్ణయించారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ, నల్లధనం వెలికితీత సహా వివిధ అంశాలతో ఇది ముడిపడి ఉన్న అంశం కావడంతో ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నారు. రెండు రోజుల క్రితం గవర్నర్ నరసింహన్‌ను కలిసిన కేసీఆర్ నోట్ల రద్దు, ప్రజల అవస్థలు, రాష్ట్ర ఆదాయనికి గండి పడుతున్న తీరును వివరించారు. అయితే సంక్షేమ కార్యక్రమాల అమలుపై దాని ప్రభావం ఏ మేరకు ఉండబోతుందన్న విషయాలను గవర్నర్‌కు వివరించారు. ఇది ప్రభుత్వ అంతర్గత విషయమైనా నోట్ల రద్దుపై కేసీఆర్ ఇప్పటి వరకు బహిరంగంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. పార్టీ నేతలు మాత్రం మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే అందులోని లోపాలను ఎత్తి చూపుతున్నారు. అయితే ఈ ఇబ్బందులు అన్ని రాష్ట్రాల్లోనూ ఉండడంతో ఆచితూచి వ్యవహరించాలని అధిష్ఠానం భావిస్తోంది. తొందరపడి కేంద్రంపై పోరాటానికి దిగరాదని నిర్ణయించింది. నోట్ల రద్దు విషయంలో కేంద్రంపై పోరాటానికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగం కాకూడదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీని ఆదేశించినట్టు సమాచారం. మమత, కేజ్రీవాల్ తరహాలో నోట్ల రద్దు విషయంలో కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వాల్సిన అవసరం లేదని, అయితే ప్రజల ఇబ్బందులను మాత్రం కేంద్రం దృష్టికి తీసుకెళ్లే విషయంలో వెనకాడవద్దని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. సోమవారం సాయంత్రం ఢిల్లీలో జరిగే అఖిలపక్ష భేటీలో ప్రజల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ నేతలను సీఎం ఆదేశించారు.

  • Loading...

More Telugu News