: ప్రజాప్రతినిధులందరూ ప్రభుత్వాసుపత్రుల్లోనే చికిత్స చేయించుకోవాలి: ప్రొ.కోదండరాం
టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాం అధ్యక్షతన ఈ రోజు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణలో వైద్యరంగ బలోపేతం, ఆరోగ్యశ్రీ బకాయిల విడుదలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైద్య రంగంలో ప్రజల సమస్యలపై చర్చించి, సూచనలు చేస్తూ ఓ నివేదికను తయారు చేశారు. ఈ నివేదికను త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపనున్నట్లు కోదండరాం తెలిపారు. మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులందరూ ప్రభుత్వాసుపత్రుల్లోనే చికిత్స చేయించుకోవాలని కోదండరాం సూచించారు. వైద్య చికిత్సల ప్రమాణాలు పెరగాలని కోదండరాం అన్నారు. వైద్య ఆరోగ్య భద్రత నుంచి కాకుండా ఆరోగ్యశ్రీకి విడిగా నిధులు కేటాయించాలని సూచించారు. వైద్యరంగం బలోపేతం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ మార్పులను సాధించడానికి నియమిత కాలపరిమితిలో చర్యలు తీసుకోవాలని అన్నారు. కొంతమందికి వైద్య ఆరోగ్య సదుపాయాలు సరిగా అందకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజారోగ్య పరిరక్షక వ్యవస్థ ఎలా ఉంటే బాగుంటుందన్న విషయంపై తాము చర్చించినట్లు చెప్పారు. ఈ రోజు వచ్చిన సూచనలన్నింటినీ ప్రభుత్వానికి పంపిస్తామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మేలు జరిగేలా, సమర్థంగా సేవలు అందేలా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.