: పాముకు పాలు, చీమకు చక్కెర వేసే పవిత్రమైన జాతి మనది!: వెంకయ్యనాయుడు
మతం వ్యక్తిగతమని, మనందరి గతం ఒకటేనని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ రోజు నెల్లూరు జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మతం పేరుతో వేరు చేయాలని చూస్తోన్న రాజకీయ నాయకుల మాటలు నమ్మకూడదని సూచించారు. దేశ ప్రజలు జాతీయతా భావాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు. మతాలు వేరైనా భారతీయులంతా ఒకటేనని అన్నారు. దేశంలో ఏ మత పద్ధతులైనా పాటించుకోవచ్చని అన్నారు. ‘ముస్లిం అయితే గడ్డం పెంచుకో, ప్రజలకేం అడ్డం.. క్రిస్టియన్లు చర్చికి వెళతారు, ఎవరికీ ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. హిందువులు తమ పద్ధతుల్లో తమ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు’ అని వ్యాఖ్యానించారు. ఇండోనేషియా కరెన్సీలో గణేశుడి బొమ్మ ఉంటుందని వెంకయ్యనాయుడు అన్నారు. మలేషియాలో ఎయిర్ పోర్టులో ఇటీవల దీపావళి పండుగ నిర్వహించారని చెప్పారు. పలువురు రాజకీయ నాయకులు హిందూ అనే పదాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ‘పాముకు పాలు, చీమకు చక్కెర వేసే పవిత్రమైన జాతి మనదని చెప్పారు. ప్రపంచం మన వైపు చూస్తోంది.. మన దేశీయులు అటువైపు చూస్తున్నారు. చదువు పూర్తయిన తరువాత విదేశాలకు వెళ్లాలంటే వెళ్లండి. ఉద్యోగాలు చేయండి, సంపాదించండి, మళ్లీ ఇక్కడికే రండి.. దేశానికి సేవ చేయండి’ అని వెంకయ్య వ్యాఖ్యానించారు.