: సమస్యలకు విమర్శలు పరిష్కారం కావు: కర్ణాటకలో మోదీ
గోవాలో ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ అనంతరం కర్ణాటకకు వెళ్లి రాష్ట్రంలోని బెల్గాంలో కర్ణాటక లింగాయత్ ఎడ్యుకేషన్ (కేఎల్ఈ) నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు అంశంపై మాట్లాడారు. 70 ఏళ్ల పాటు దేశంలో లూటీ జరిగిందని, 70 ఏళ్ల అవినీతి రోగానికి చికిత్స చేస్తున్నామని మోదీ పేర్కొన్నారు. తమకు కొంత సమయం ఇవ్వాలని, తాము తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజల ఆశీర్వాదం కావాలని ఆయన కోరారు. కొన్ని ఇబ్బందులు ఉండడం నిజమేనని.. కానీ, ఎంతో మంచి ఫలితాన్ని అనుభవిస్తామని అన్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాత నల్లకుబేరుల వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారయిందని మోదీ చెప్పారు. ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదన్నారు. 2012, 13లో అంతా అవినీతి, కుంభకోణాలేనని చెప్పారు. డిసెంబరు 30 వరకు తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. సమస్యలకు విమర్శలు పరిష్కారం కాదని చెప్పారు. రెండేళ్లలో నల్లధనం కట్టడికి తీసుకున్న చర్యలు మంచి ఫలితాలనిచ్చాయని చెప్పారు.