: పెద్దనోట్ల రద్దుతో తలెత్తిన మహిళల బాధ వర్ణనాతీతం: భూమన కరుణాకరరెడ్డి


పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తలెత్తిన మహిళల బాధ వర్ణనాతీతంగా మారిందని వైఎస్సార్ సీపీ నేత భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఈ రోజు హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... పెద్ద నోట్ల ర‌ద్దుతో దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నార‌ని అన్నారు. సామాన్యులు పాల ప్యాకెట్లకు సైతం డబ్బుల్లేక క‌ష్టాలు పడుతున్నార‌ని, అంతేగాక ఉప్పు ధర విపరీతంగా పెరిగిపోవడం ఆందోళ‌నక‌ర‌మ‌ని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానిది అనాలోచిత నిర్ణయం అని భూమన కరుణాకరరెడ్డి అన్నారు. మోదీ ఆశయం చివరకు ప్రజల‌కు ఇబ్బందులు తెచ్చిపెడుతుంద‌ని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కష్టపడి సంపాదించిన త‌మ‌ డబ్బును తాము తీసుకోవడానికి ప్ర‌జ‌లు బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ క‌ట్టి గంట‌ల కొద్దీ నిరీక్షిస్తున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వారి సమయమంతా వృథా అయిపోతోంద‌ని, అంతేగాక కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం ఆత్మహత్యలకు దారితీస్తోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పెద్ద నోట్ల ర‌ద్దుతో కొన్ని వేల పెళ్లిళ్లు వాయిదా వేసుకోవ‌ల‌సి వ‌చ్చింద‌ని భూమన కరుణాకరరెడ్డి చెప్పారు. కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకునే ముందే అక్ర‌మంగా సంపాదించిన వారికి ఈ సమాచారం ఇచ్చారన్న అనుమానాలు వ‌స్తున్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు. సామాన్య ప్ర‌జ‌లు మాత్ర‌మే బ్యాంకుల ముందు నిల‌బ‌డి ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నార‌ని చెప్పారు. పాల ప్యాకెట్లకు కూడా డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉప్పు ధర ఆకాశాన్నంటడం భయాందోళనలు కలిగిస్తోందన్నారు. కేంద్రం తీసుకున్న అనాలోచిత నిర్ణయం ప్రభావం నల్లకుబేరులకు తగలకుండా సామాన్యులకు తగిలిందని భూమన అన్నారు. మోదీ మహత్తర ఆశయం చివరకు ప్రజల గుండెల్లో గుచ్చుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News