: ప్రధాని భావోద్వేగం... ఉబికొచ్చిన కన్నీటి చుక్క!
ప్రస్తుతం గోవా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, నల్లదనంపై తాను తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయం గురించి మాట్లాడుతున్న వేళ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సమయంలో కంటి నుంచి వస్తున్న నీటిని తుడుచుకోవడం, అందరి హృదయాలనూ బరువెక్కించింది. "నేనేమీ అత్యున్నత పదవిని అనుభవించేందుకు పుట్టలేదు. పుట్టుకతోనే నా వద్ద డబ్బు లేదు. అధికారం లేదు. దేశ ప్రజల కోసం కుటుంబాన్ని, ఇంటిని కూడా త్యాగం చేశాను. ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం దేశ వ్యవస్థలో ఎలాంటి మార్పును తెస్తుందో నాకు తెలుసు. కొంతకాలం ఆగితే, దాని ప్రభావం ఏంటో ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. నాపై నమ్మకంతో కోట్ల మంది అండగా నిలిచారు. ఏమిచ్చి ప్రజల రుణం తీర్చుకోగలను?" అని మోదీ వ్యాఖ్యానించారు. ఆభరణాల కొనుగోలుకు పాన్ కార్డును తప్పనిసరి చేయవద్దని ఎంతో మంది ఎంపీలు తనను కోరారని, అయినా తాను వినలేదని చెప్పిన మోదీ, దాదాపు 10 నెలల నుంచే పెద్ద నోట్ల రద్దు ఆలోచన చేసినట్టు తెలిపారు.