: ఎస్ఎస్ఎల్సీ పాస్ అయ్యాక వచ్చి గుండు కొట్టించుకున్నా... మళ్లీ ఇప్పుడే రావడం: తిరుమలలో సీపీఐ నారాయణ
ఏదో ఒక సంచలన కామెంటుతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే 'సీపీఐ' నారాయణ ఆశ్చర్యకరంగా తిరుమల శ్రీవారిని ఈ ఉదయం దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, తాను ఎస్ఎస్ఎల్సీ పాస్ కాగానే ఇక్కడికి వచ్చి గుండు కొట్టించుకున్నానని, ఆపై ఇదే రావడమని అన్నారు. అప్పటితో పోలిస్తే, భక్తుల సంఖ్య వందల రెట్లు పెరిగిపోయిందని చెప్పారు. చాలా కాలం తరువాత ఇక్కడికి వచ్చానని చెప్పారు. పెద్ద నోట్లను రద్దు చేసిన తరువాత బ్యాంకుల వద్ద వేల మంది పేదలు, సామాన్యులు కనిపిస్తున్నారే తప్ప ధనవంతులు ఎవరూ బ్యాంకుల వద్దకు రాలేదని విమర్శించారు. మోదీ ఆలోచన తప్పని, తొందరపాటుతో కూడుకున్నదని అన్నారు. కాగా, నిన్న నారాయణ కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని కూడా సందర్శించారు.