: సిమి ఉగ్రవాదుల సమాచారం చెప్పిన గ్రామస్తులకు రివార్డులు.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన
సిమి ఉగ్రవాదుల సమాచారం ఇచ్చిన గ్రామస్తులకు రివార్డులు ఇవ్వనున్నట్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. భోపాల్ జైలు నుంచి తప్పించుకున్న ఉగ్రవాదులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన సంగతి తెలిసిందే. తప్పించుకున్న 8 మంది ఉగ్రవాదుల సమాచారం ఇచ్చి వారి ఎన్‌కౌంటర్‌కు సహకరించిన ప్రజలకు రివార్డులు అందజేయనున్నట్టు శనివారం ప్రభుత్వం ప్రకటించింది. ‘హిందూస్థాన్ టైమ్స్’ పత్రిక కథనం ప్రకారం.. జైలు నుంచి తప్పించుకున్న ఉగ్రవాదులను చూసినట్టు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు నాలుగు ఫోన్లు వచ్చాయి. వచ్చిన మూడు కాల్స్ ఆధారంగానే ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఉగ్రవాదులు తమ గ్రామంలోని కొండపై తలదాచుకున్నట్టు ఖిజ్రాదేవ్ గ్రామం నుంచి ఓ ఫోన్‌కాల్ ద్వారా పోలీసులకు సమాచారం అందింది. కాగా సిమి ఉగ్రవాదుల సమాచారం అందించినందుకు రివార్డు ఇవ్వాలని భావించిన ప్రభుత్వం శనివారం ఈ ప్రకటన చేసింది.