: రూ.నాలుగు వేల కోసం రాహుల్ గాంధీ లగ్జరీ కారులో వచ్చారు.. అమిత్‌షా ఎద్దేవా
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా సెటైర్ వేశారు. నాలుగువేల రూపాయల కోసం రాహుల్ ఖరీదైన కారులో బ్యాంకుకు వచ్చారని ఎద్దేవా చేశారు. ‘‘లగ్జరీ కారులో వచ్చిన ఓ వ్యక్తి రోజువారీ ఖర్చుల కోసం రూ.4 వేలు విత్‌డ్రా చేసుకోవడం మనం ఎక్కడైనా చూశామా?’’ అని సెటైర్ వేశారు. పాత నోట్లను మార్చుకునేందుకు రాహుల్ గాంధీ బ్యాంకు క్యూలో నిల్చోవడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు అమిత్ షా ఇలా స్పందించారు. నోట్ల రద్దుతో ఉగ్రవాదం, నక్సలిజం, నకిలీ నోట్ల చలామణి ముఠాలకు చెక్ పడిందని ఆయన తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని, ఎన్నికల్లో ప్రలోభాలు తగ్గుతాయని షా వివరించారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని షా పేర్కొన్నారు.