: రెండుమూడు వారాలు ఓపిక పట్టండి.. ఏటీఎంల నిండా డబ్బేడబ్బు: జైట్లీ
పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న అవస్థలు మరో రెండుమూడు వారాల్లో పూర్తిగా తొలగిపోతాయని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న రెండు లక్షల ఏటీఎంలో మరో రెండు మూడు వారాల్లో డబ్బు నిల్వలు పెరుగుతాయని, మామూలుగా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. శనివారం న్యూస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన జైట్లీ.. ఏటీఎంలలో పాత నోట్లను తొలగించి కొత్త నోట్లతో నింపుతున్నామని, ఈ మొత్తం ప్రక్రియకు తక్కువలో తక్కువగా రెండు వారాలు పడుతుందన్నారు. ప్రజలు సహనం వహించాలని, పరిస్థితులు మళ్లీ త్వరలోనే సాధారణ స్థితికి చేరుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నోట్ల మార్పిడి విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, 50 రోజుల సమయం ఉందని పేర్కొన్నారు. దేశంలో ఉన్న రెండు లక్షల ఏటీఎంలను నిపుణులు సందర్శించారని, వాటిని తిరిగి కొత్త నోట్లతో నింపి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు రెండు మూడు వారాలు పడుతుందని వారు చెప్పినట్టు మంత్రి వివరించారు. అసౌకర్యానికి చింతిస్తున్నట్టు జైట్లీ చెప్పారు. రాత్రికి రాత్రే నోట్లను పెద్ద ఎత్తున ఏటీఎంలలో పెట్టడం సాధ్యం కాదని, కొంత సమయం పడుతుందని మంత్రి వివరించారు. రూ.500, రూ.2000 నోట్ల సైజుకు తగ్గట్టుగా ఏటీఎంలను సరిచేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. కాబట్టి ప్రజలు కొంత సంయమనం పాటించాలని సూచించారు.