: పెద్ద నోట్ల మార్పిడి తతంగంలో ప్రజలకు టోపీ పెడుతున్న బ్యాంకు అధికారులు!
రోజుకు నాలుగు వేల రూపాయల వరకూ బ్యాంకుల నుంచి పాత కరెన్సీని మార్చుకోవచ్చన్నది ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు. కానీ బ్యాంకుల్లో జరుగుతున్నది వేరు. గంటల కొద్దీ క్యూలైన్లలో నిలబడి, కౌంటర్ వద్దకు వెళ్లిన తరువాత, కొందరికి రెండు వేలే ఇస్తున్నారు. మరికొందరికి 3 వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అందరికీ ఇవ్వాలంటే, కొంత కోత తప్పదని బ్యాంకు అధికారులు చెబుతున్నారని, బ్యాంకులకు వెళ్లొచ్చిన ప్రతి ఒక్కరూ అంటున్నారు. ఇక్కడే కొందరు బ్యాంకర్లు అక్రమాలకు తెరలేపుతున్నారు. ఒక్కో వ్యక్తి దగ్గర ఒకటి నుంచి రెండు వేల రూపాయలను ఆదా చేసి, రాత్రికి అంత మొత్తం నల్లధనాన్ని కొత్త కరెన్సీలోకి మార్చి 30 నుంచి 40 శాతం కమిషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి డబ్బు తీసుకునేందుకు నింపాల్సిన ఫాంలో రూ. 4 వేలను తీసుకుంటున్నట్టు రాసి ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఇస్తున్నది మాత్రం తక్కువ. మిగిలిన వెయ్యి, రెండు వేలతో కమీషన్ల దందాకు తెరలేస్తోంది. తమకు తెలిసిన, తమకు కమీషన్లు ఇచ్చే అక్రమార్కులతో కుమ్మక్కైన బ్యాంకు అధికారులు ఈ తరహా దందాలతో తమ జేబులు నింపుకుంటున్నట్టు విమర్శలు పెరుగుతున్నాయి.