: ఢిల్లీలో నిలిచిపోనున్న 2 లక్షల భారీ డీజిల్ వాహనాలు.. 15 ఏళ్ల పాతవాటిపై ప్రభుత్వం కొరడా
15 ఏళ్ల నాటి భారీ డీజిల్ వాహనాలపై ఢిల్లీ ప్రభుత్వం కొరడా ఝళిపించింది. నేటి నుంచి దాదాపు 2 లక్షల వాహనాల ప్రయాణం ఆగిపోనుంది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలతో 1.91 లక్షల వాహనాల రిజిస్ట్రేషన్‌ను రవాణా శాఖ రద్దు చేసింది. శుక్రవారం రాత్రి రిజిస్ట్రేషన్ రద్దు చేసిన వాహనాల జాబితాను అన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు పంపినట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గుర్తించిన వాహనాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు కూడా పంపినట్టు పేర్కొన్నారు. రవాణా శాఖ పంపిన జాబితాలో వాహన యజమానుల పేర్లు, రిజిస్ట్రేషన్ నంబరు, చిరునామా, ఆ వాహనాన్ని ఎక్కడ రిజిస్టర్ చేశారనే సమాచారాన్ని కూడా పేర్కొన్నారు. ఈ జాబితాలో రవాణా శాఖ రిజిస్ట్రేషన్ రద్దు చేసిన 1.91 లక్షల డీజిల్ వాహనాల సమాచారం ఉంది. వీటిని అధికారికంగా నేటి నుంచి రోడ్లపై నడవనివ్వబోమని అధికారులు తెలిపారు. అంతేకాదు రోడ్డు పక్కన వాటిని పార్క్ చేసేందుకు కూడా అనుమతించేది లేదని పేర్కొన్నారు.