: ట్రంప్‌పై అమెరికాలో వెల్లువెత్తుతున్న నిరసనలు.. ఒరెగావ్‌లో ఆందోళకారుడిపై కాల్పులు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ అనూహ్య విజయాన్ని హిల్లరీ క్లింటన్ మద్దతుదారులు తట్టుకోలేకపోతున్నారు. ట్రంప్‌ను అధ్యక్షుడిగా అంగీకరించలేని వారు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ట్రంప్ తమ అధ్యక్షుడు కాదంటూ రోడ్డెక్కుతున్నారు. ఈ నిరసన క్రమంగా వేడెక్కి హింసాత్మక రూపం సంతరించుకుంటోంది. శనివారం పోర్ట్‌ల్యాండ్‌లోని ఒరెగావ్‌లో ట్రంప్ విజయంపై వాగ్యుద్ధం జరిగింది. దీంతో రెచ్చిపోయిన ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో హిల్లరీ మద్దతుదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అతడికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి కూడా ఒరెగావ్‌లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. పోలీసులపైకి ఆందోళనకారులు నిప్పు కణికలు విసరడంతో వారు బాష్పవాయువు ప్రయోగించారు. శనివారం మధ్యాహ్నం మన్‌హట్టన్‌లోని వాషింగ్టన్ స్వ్కేర్ పార్కులో ‘లవ్ ర్యాలీ’ నిర్వహించారు. మియామీ, అట్లాంటాల్లోనూ శనివారం సాయంత్రం నిరసనలు వెల్లువెత్తాయి. అయితే ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుకోవాలని చూసినా ట్రంప్‌ను అధ్యక్ష పీఠమెక్కకుండా ఎవరూ అడ్డుకోలేరని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. కాలిఫోర్నియాలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. లాస్‌ఏంజెలెస్‌లో నిరసన తెలుపుతున్న 200 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ట్రంప్‌కు వ్యతిరేకంగా, ఎలక్టోరల్ కాలేజీలో హిల్లరీకి మద్దతు కూడగట్టేందుకు డెమొక్రటిక్ పార్టీ సంతకాల సేకరణ ప్రారంభించింది.