: రక్తం పంచుకుని పుట్టకపోయినా మీది, నాది అన్నాచెల్లెళ్ల బంధం: చంద్రబాబు
రక్తం పంచుకుని పుట్టకపోయినా మీది, నాది అన్నాచెల్లెళ్ల బంధమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డ్వాక్రా మహిళలను ఉద్దేశించి అన్నారు. జనచైతన్య యాత్రల్లో భాగంగా శనివారం శ్రీకాకుళంలో పర్యటించిన ముఖ్యమంత్రి డ్వాక్రా మహిళల బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రంలో 9 లక్షల డ్వాక్రా గ్రూపుల్లో 90 లక్షల మంది సభ్యులు ఉన్నారని, అప్పట్లో తాను ఏర్పాటు చేసిన డ్వాక్రా సంఘాల్లో ఈరోజు ఇంత భారీ స్థాయిలో సభ్యులు ఉండడం తనకు ఆనందం కలిగిస్తోందన్నారు. డ్వాక్రా సంఘాలు, మెప్మా గ్రూపులు తన మానస పుత్రికలన్నారు. ఒకప్పుడు ఈ సంఘాలను చూసి నవ్విన వారే నేడు వారి విజయాలను చూసి ముక్కున వేలేసుకుంటున్నారని పేర్కొన్నారు. గతంలో డ్వాక్రా రుణమాఫీ నిధులు విడుదల చేసినప్పుడు కొన్ని నిబంధలను పెడితే మహిళలు నొచ్చుకున్నారని పేర్కొన్న చంద్రబాబు, ఈసారి పసుపు-కుంకుమ కింద మంజూరు చేసే రూ.10 వేల కోట్ల ఖర్చు విషయంలో ఎటువంటి నిబంధనలు విధించడం లేదన్నారు. వాటిని స్వేచ్ఛగా ఖర్చు చేసుకోవచ్చని తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వేగం పుంజుకునేందుకు డ్వాక్రా మహిళలు ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. 2017 నాటికి రాష్ట్రాన్ని బహిరంగ మల విసర్జన రహిత(ఓడీఎఫ్) రాష్ట్రంగా తీర్చిదిద్దుదామని అన్నారు. మహిళలపై ఆకతాయిలు దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని, ఉక్కుపాదం మోపుతామని చంద్రబాబు హెచ్చరించారు.