: ఆ బ్యాంకు ఎంపీల కోసమేనట!.. ఇతరులకు ప్రవేశం లేదంటూ నోటీసు బోర్డు అతికించిన వైనం
నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఓ బ్యాంకు అతికించిన నోటీసు బోర్డు పుండుమీద కారం చల్లినట్టు అయింది. పార్లమెంటు ఆవరణలో ఉన్న ఎస్బీఐలోకి ఇతరులు ఎవరూ ప్రవేశించడానికి వీల్లేదని, ఇది ఎంపీలకు మాత్రమేనంటూ ఓ నోటీసు బోర్డు వేలాడదీశారు. రద్దయిన నోట్లను మార్చుకునేందుకు ఎంపీలకు ప్రైవసీ కోసమే ఇలా చేశారట. లోక్‌సభలోని 545 మంది, రాజ్యసభలోని 250 మంది ఎంపీల జీతభత్యాలతోపాటు మాజీ ఎంపీల పెన్షన్ డబ్బులు, పార్లమెంటు సిబ్బంది జీతభత్యాలు కూడా ఇక్కడే జమ అవుతాయి. నోట్ల రద్దుతో తమ నోట్లను మార్చుకునేందుకు పార్లమెంటు సిబ్బంది బ్యాంకులో క్యూకట్టారు. అదే సమయంలో బ్యాంకుకు వచ్చిన ఎంపీలు లైను చూసి భయపడ్డారు. దీంతో వెంటనే అధికారులను కలిసి ఇది ఎంపీల కోసమే కాబట్టి ఇతరులను అనుమతించవద్దని ఆదేశించారు. ఇంకేముంది.. వెంటనే ఓ నోటీసు బోర్డు తగిలించేశారు. ఇది ఎంపీలకు మాత్రమేనని, ఇతరులను లోనికి అనుమతించబోమని అందులో పేర్కొన్నారు. దీంతో జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిపాటి అసౌకర్యాన్ని కూడా ఎంపీలు తట్టుకోలేకపోతున్నారని, బయట రోడ్లపై ప్రజలు పడుతున్న కష్టాలు వారికి కనిపించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.