: దేవుడికి ధనాభిషేకం... ఆలయాల్లో హుండీల నిండా 500, 1000 నోట్లు
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో దేవుళ్లకు ధనాభిషేకం జరుగుతోంది. నోట్ల రద్దు నిర్ణయంతో బెంబేలెత్తినవారంతా కనీసం పుణ్యమైనా వస్తుందనుకున్నారో ఏమో కానీ, దేవాలయాలకు క్యూకట్టారు. దీంతో అన్ని ఆలయాల హుండీలు పాత నోట్ల కట్టలతో కళకళలాడుతున్నాయి. తాజాగా షిర్డీ సాయిబాబా ఆలయానికీ రద్దయిన పాతనోట్ల రూపంలో కానుకలు వెల్లువెత్తడం విశేషం. గత మూడు రోజుల్లో షిరిడీ హూండీలలో భక్తులు 1.50 కోట్ల రూపాయలు కానుకలుగా సాయిబాబాకు సమర్పించగా, వీటిలో ఏకంగా 1.07 కోట్ల రూపాయలు రద్దైన 500, 1000 రూపాయలు నోట్లే కావడం విశేషం. రద్దయిన నోట్లను షిర్డీ సాయిసంస్థాన్ స్వీకరించడం లేదని ప్రకటించినప్పటికీ, భక్తులు పాత నోట్లనే హుండీల్లో వేయడం విశేషం. దీంతో రానున్న రోజుల్లో కూడా ఈ నోట్ల ప్రవాహం ఆగేలా కనిపించడం లేదని ఆలయాల పెద్దలు పేర్కొంటున్నారు. దీంతో మరాఠ్వాడాలోని అనేక మందిరాల్లో ఉన్న హుండీలకు సీల్ వేశారు. కాగా, ఆలయాల హుండీలలో సమర్పించే కానుకలకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.