: భారత్ తో జపాన్ ఒప్పందాలపై అక్కసు వెళ్లగక్కిన చైనా మీడియా
ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో ఉన్న వేళ... జపాన్ కు చైనా పరోక్ష బెదిరింపు హెచ్చరికలు చేస్తోంది. తమ దేశాన్ని కట్టడి చేసేందుకు భారత్ ను పావుగా వాడుకోవాలన్న జపాన్ దౌత్యనీతి ఎప్పటికీ సఫలం కాదని చైనా మీడియా కథనాలు రాసింది. వాస్తవానికి జపాన్ లానే చైనాతో భారత్ కు కూడా సరిహద్దు, ఇతర సమస్యలు ఉన్నాయి. భారత్ ను కట్టడి చేసేందుకు చైనా పెట్టుబడుల పేరిట పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ లను ఆకట్టుకుని, వాటిని భారత్ కు వ్యతిరేకంగా ప్రేరేపిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో నేరుగా భారత్ తో ఘర్షణ పడుతోంది. దీంతో చైనాను కట్టడి చేసేందుకు వివిధ దేశాలతో భారత్ పటిష్ట బంధం నెరపుతోంది. ఈ నేపథ్యంలో భారత్-జపాన్ ల మైత్రి చైనాకు కంటగింపుగా మారింది. అణ్వస్త్ర దేశాలైన ఈ రెండు దేశాలు కలిస్తే కష్టాలు తప్పవని భావించిన చైనా మీడియా మోదీ పర్యటనకు ముందే తమను ఇబ్బంది పెట్టే ఒప్పందాలు చేసుకోవద్దని హెచ్చరికలు చేస్తూ కథనాలు ప్రసారం చేసింది. మోదీ వెళ్లి జపాన్ తో ఒప్పందాలు చేసుకున్న వేళ...జపాన్ ఆశ నెరవేరబోదని ఆ దేశ ప్రభుత్వ మీడియా కథనాలు వండి వార్చింది. భారత విదేశీ విధానం బహుళ దృష్టితో కూడుకున్నదని, చైనా, జపాన్ రెండు దేశాలనుంచి లబ్ధిపొందాలని భారత్ చూస్తున్నదని పేర్కొంది. భారత్ కు జపాన్ సహకరించాలనుకుంటున్నదని, కానీ, దీర్ఘకాలిక వ్యూహాలు లేని జపాన్ కు ఈ విషయంలో నిరాశ ఎదురుకాకతప్పదని చైనాకు చెందిన నేషనలిస్టిక్ గ్లోబల్ టైమ్స్ తన సంపాదకీయంలో పేర్కొంది. భారత్-చైనా మధ్య ఉన్న విభేదాలతో జపాన్ లబ్ధి పొందాలని చూస్తోందని పేర్కొంది. కానీ, తమ రెండు దేశాల మధ్య తరచూగా హైలెవల్ సంప్రదింపులు జరగతుండటంతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతున్నాయని గ్లోబల్ టైమ్స్ వ్యాఖ్యానించింది. కాబట్టి ఈ విషయంలో జపాన్ పొందే లబ్ధి ఏమీ ఉండదని పేర్కొంది.