: పెద్దనోట్లు తీసుకోమన్న ఆసుపత్రి.. గాల్లో కలసిన శిశువు ప్రాణాలు!


పెద్దనోట్ల రద్దు వ్యవహారం అభంశుభం తెలియని శిశువు ప్రాణాలు తీసిన విషాద సంఘటన ముంబయిలో జరిగింది. గోవండి ప్రాంతానికి చెందిన జగదీష్, కిరణ్ శర్మ భార్యాభర్తలు. నిండు గర్భిణీ అయిన కిరణ్ శర్మ బుధవారం నాడు తన నివాసంలోనే ప్రసవించింది. అయితే, శిశువుకు జ్వరం వుండడంతో వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న జీవన్ జ్యోత్ హాస్పిటల్ అండ్ నర్సింగ్ హోమ్ కు తన భార్యను, శిశువును తీసుకుని భర్త జగదీష్ వెళ్లాడు. గత ఆరు నెలలుగా కిరణ్ శర్మకు రెగ్యులర్ చెకప్ నిమిత్తం ఇదే ఆసుపత్రికి వస్తున్నారు. అయితే, రూ.6000 డిపాజిట్ చేయమని ఆసుపత్రి సిబ్బంది కోరారు. జగదీష్ తన వద్ద ఉన్న రూ.500, రూ.1000 నోట్లను బయటకు తీయడంతో, వాటిని డిపాజిట్ చేసుకునేందుకు సదరు సిబ్బంది నిరాకరించారు. ఎంత బ్రతిమలాడినప్పటికి జగదీష్ మాటలను వారు పట్టించుకోలేదు. వైద్యసేవల నిమిత్తం ఈ నోట్లు చెల్లుతాయని ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ఆసుపత్రి సిబ్బందికి గుర్తుచేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. వేరే ఆసుపత్రికి తీసుకువెళ్లే అవకాశం కూడా లేకపోవడంతో, హై ఫీవర్ తో పోరాడిన ఆ శిశువు నిన్న మృతి చెందింది. దీంతో కన్నీరుమున్నీరైన శిశువు తల్లిదండ్రులు, సదరు ఆసుపత్రి సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News