: ట్రంప్ పదవీ కాలం ఏడాదిపాటేనా?...అభిశంసన ద్వారా తొలగిస్తారా?
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ కాలం ఏడాదిపాటే కొనసాగనుందా? ఏడాది తరువాత రిపబ్లిక్ పార్టీ అభిశంసన ద్వారా తొలగించనుందా? అనే చర్చ నడుస్తోంది. ట్రంప్ అధ్యక్షుడవుతారని చెప్పిన ప్రొఫెసర్ అలాన్ లిచ్ మ్యాన్, కాలమిస్ట్ డేవిడ్ బ్రూక్స్ తాజాగా చేసిన వ్యాఖ్యలే ఈ చర్చకు కారణమయ్యాయి. ట్రంప్ స్థానంలో మైక్ పెన్స్ లాంటి అతి నమ్మకస్తుడిని రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని చూస్తోందని లిచ్ మాన్ అభిప్రాయపడ్డారు. రిపబ్లికన్ కాంగ్రెస్ ట్రంప్ ను అధ్యక్షుడిగా అంగీకరించేందుకు ఇష్టపడడం లేదని ఆయన అన్నారు. ట్రంప్ అధ్యక్షుడైతే, అతనిని నియంత్రించడం అంత సులభం కాదని రిపబ్లికన్ కాంగ్రెస్ భావిస్తోందని ఆయన చెప్పారు. ఇది కేవలం తన భావన మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. పెన్స్ చెప్పినట్టు వింటారని భావిస్తోన్న రిపబ్లికన్ పార్టీ, ఆయనను నియంత్రించడం తేలిక అనే భావనలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రభ ఏడాదిపాటే ఉంటుందని న్యూయార్క్ టైమ్స్ కాలమిస్ట్ డేవిడ్ బ్రూక్స్ కూడా అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది ట్రంప్ తో రాజీనామా చేయించడం కానీ, అభిశంసన ద్వారా తొలగించే అవకాశం కానీ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంతో ట్రంప్ విజయం సాధిస్తారని చెప్పినవాళ్లే ఆయనను తొలగిస్తారని చెప్పడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.