: టీమిండియా ఆలౌట్...డ్రా దిశగా మొదటి టెస్టు
రాజ్ కోట్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా పోరాటం ముగిసింది. 319/4 ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో 169 పరుగులను జత చేసి, 488 పరుగులకు ఆలౌటైంది. అమిత్ మిశ్రా (0) నిన్న చివరి బంతికి అవుట్ కావడంతో కోహ్లీకి జతగా అజింక్యా రహానే (13) క్రీజులోకి వచ్చాడు. నిలకడగా ఆడతాడనుకున్న రహానే త్వరగానే ఐదో వికెట్ గా అవుటయ్యాడు. దీంతో ఊహించని విధంగా విరాట్ కోహ్లి (40) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో క్రీజులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ (70), వృద్ధిమాన్ సాహా (35) లు బాధ్యతాయుతంగా ఆడి భారత్ ఇన్నింగ్స్ కు ఊపిరిపోశారు. వీరిద్దరు అద్భుతమైన భాగస్వామ్యంతో ప్రత్యర్థితో గల పరుగుల వ్యత్యాసాన్ని తగ్గించారు. సాహా అవుటైనా, చెక్కుచెదరని ఏకాగ్రతతో అశ్విన్ పోరాటం సాగించాడు. ఈ క్రమంలో అర్ధసెంచరీ సాధించి, చివరి వికెట్ గా పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ ను 488 పరుగుల వద్ద ముగించగా, ఇంగ్లండ్ కు 49 పరుగుల ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్ నాలుగు వికెట్లతో రాణించగా, అన్సారీ, మొయిన్ అలీ చెరి రెండు వికెట్లు తీశారు. స్టువర్ట్ బ్రాడ్, బెన్ స్టోక్స్ ఒక్కో వికెట్ తో వారికి చక్కని సహకారమందించారు. అనంతరం ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. కెప్టెన్ కుక్ (12), హమీద్ (12)తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. టీమిండియా కెప్టెన్ కొహ్లీ పేసర్లను పక్కనపెట్టి బంతిని నేరుగా స్పిన్నర్లకు అందించాడు. వికెట్లు తీయడమే లక్ష్యంగా టీమిండియా వ్యూహం రచించింది.