: నోట్ల ఎఫెక్ట్... జీహెచ్ఎంసీకి ఒక్కరోజే రూ. 50 కోట్ల ఆదాయం
పాత నోట్ల రద్దుతో ఎవరెన్ని ఇబ్బందులు పడుతున్నా... జీహెచ్ఎంసీకి మాత్రం బాగా కలిసొచ్చింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన పలు గ్రాంట్లు రాకపోవడం, ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోవడంతో జీహెచ్ఎంసీ ఖజానా ఖాళీగా ఉంది. జీహెచ్ఎంసీ ఖజానా నుంచే ఆర్టీసీకి రూ. 330 కోట్లు చెల్లించడం, రూ. 1200 లోపు వారికి ఆస్తి పన్ను నుంచి మినహాయింపును ఇవ్వడం తదితర కారణాలతో... ఖజానా ఖాళీ అయిపోయింది. అంతకు ముందు రూ. 800 కోట్ల మిగులు నిధులతో జీహెచ్ఎంసీ కళకళలాడేది. ఈ నేపథ్యంలో, పాత నోట్ల రద్దు అంశం జీహెచ్ఎంసీకి ఊపిరి పోసింది. పాత నోట్లతోనే ఆస్తి పన్ను బకాయిలు చెల్లించవచ్చంటూ ఆఫర్ ఇవ్వడంతో... జనాలంతా తమ వద్ద ఉన్న పాత నోట్లతో బకాయిలు చెల్లిస్తున్నారు. దీంతో, నిన్న ఒక్క రోజే జీహెచ్ఎంసీకి రూ. 50 కోట్ల ఆదాయం సమకూరింది. మరోవైపు, పాత నోట్లతో వివిధ రకాల పన్నులు, ఫీజులు చెల్లించే అవకాశాన్ని ఈ నెల 14వ తేదీ వరకు పొడిగించినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు.