: మోదీజీ...ఈ క్యూలైన్లలో ఎంత మంది నల్ల కుబేరులున్నారు?...ఎవరిని ఇబ్బంది పెట్టారు?: నిలదీసిన కేజ్రీవాల్
500, 1000 రూపాయల నోట్ల రద్దు తరువాత ఇదో అద్భుతమైన నిర్ణయమని, త్వరలోనే నల్లధనం అంతమైపోతుందన్న ఆశావహ దృక్పధంతో ఎన్ని ఇబ్బందులెదురైనా మధ్యతరగతి ప్రజలు సర్దుకుపోతున్నారు. ఈ సమయంలో సోషల్ మీడియా ద్వారా డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంధించిన ప్రశ్నలు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. బ్యాంక్ క్యూలైన్లలో ఒక్క నల్ల కుబేరుడైనా కనిపించాడా? కనీసం పెద్ద స్థాయి ఉద్యోగి ఒక్కరైనా దర్శనమిచ్చారా? పెద్ద కరెన్సీ రద్దయినా వారు భేషుగ్గా ఎలా ఉండగలుగుతున్నారు? 500 రూపాయల నోటిస్తే 400 రూపాయల చిల్లర ఇచ్చి, వంద రూపాయలు కమిషన్ గా ఇస్తున్న వారికి ఆ డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయి? అని ఆయన నిలదీశారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం తన వర్గానికి లాభం కలిగించేలా ఈ నిర్ణయం అమలు చేశారని ఆయన మండిపడుతున్నారు. 500, 1000 రూపాయలు రద్దు చేసి, వాటి స్థానంలో కొత్త 500, 2000 రూపాయల తీసుకురావడం వల్ల నల్లధనాన్ని ప్రధాని ఎలా కట్టడి చేస్తారో దేశ ప్రజలకు నిజాయతీగా చెప్పాల్సిన అవసరం ఉందని, ఈ విషయం ప్రధాని వివరించాలని ఆయన సూచించారు. ఆయన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ఏకీభవిస్తున్నారు. ఓ స్థాయి కలిగిన వారంతా బ్యాంకు కార్డులు వినియోగించేందుకు అలవాటుపడిపోయారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, చిరు వ్యాపారులు, చిరుద్యోగులు, రైతులు మాత్రమే బ్యాంకులు, ఏటీఎంలకు పరుగులు పెడుతున్నారు. దీని వల్ల బ్యాంకుల్లో చోటుచేసుకున్న తోపులాటలు, నిరీక్షణల కారణంగా ఈ రోజు సుమారు నలుగురు ఖాతాదారులు ప్రాణాలు కోల్పోయారు. వీళ్లంతా ఏ వెయ్యో, పదివేలో తీసుకోవడానికి వచ్చినవారే తప్ప కోట్లు డిపాజిట్ చేసినవాళ్లు కారని పేర్కొంటున్నారు. దీంతో కేజ్రీవాల్ అడుగుతోంది నిజమేనని మెజారిటీ వర్గం అభిప్రాయపడుతోంది.