: అభిమానిని ఓదార్చిన హిల్లరీ క్లింటన్!
నిన్నటి వరకు పెద్ద జట్టు (టీం), అసాధారణ భద్రతా సిబ్బంది. వందిమాగధులు, హంగూ ఆర్భాటాలు, ఆడంబరాలు, మీటింగులు, వాగ్బాణాలు, సమాలోచనలు, చర్చోపచర్చలు... ఇదీ.. గత కొంతకాలంగా హిల్లరీ క్లింటన్ జీవితం. అధ్యక్ష ఎన్నికలు ముగిసిపోయాయి. ఫలితం కూడా వచ్చింది. దీంతో ఓటమిని స్వీకరిస్తున్నట్టు ప్రసంగం చేసిన హిల్లరీ, ఆ తరువాత ఎవరికీ అందుబాటులో లేకుండాపోయారు. దీంతో ఓటమి భారం భరించలేక ఆమె కుమిలిపోతూ, ఓ గదిలో ఎవరికీ అందుబాటులో లేకుండా ఉంటుందని యావత్ అమెరికా భావించింది. దానికి భిన్నంగా, ఓటమి భారం తనను ఏమీ చేయలేదన్నట్టుగా వాహ్యాళికి వెళ్లిన ఫోటోలను అమెరికాలోని మీడియా ప్రసారం చేశాయి. ఆ ఫోటోలో కూతుర్ని ఎత్తుకుని ఉన్న మహిళతో కలిసి హిల్లరీ ఉన్నారు. న్యూయార్క్ శివారులోని వెస్ట్ చెస్టర్ కౌంటీలో మార్కోట్ గెర్ స్టర్ అనే మహిళ కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఆమె హిల్లరీకి డై హార్డ్ ఫ్యాన్. అదే కౌంటీలోని చెపాక్ ప్రాంతంలో హిల్లరీ దంపతులు నివసిస్తారు. హిల్లరీ ఓటమితో ఆమె తీవ్ర నిశాకు గురయ్యారు. అనంతరం జరిగిన పరిణామాలను ఆమె తన ఫేస్ బుక్ పేజ్ లో పేర్కొంటూ ఇలా రాసింది... ‘నా అభిమాన నాయకురాలు (హిల్లరీ) ఓటమి నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఇంట్లో కూర్చుని ఎంతో బాధపడ్డా. ఎన్నాళ్లిలా ఉంటామని నా చిన్నారిని తీసుకుని పార్క్ కు వెళ్లా. అక్కడ కాస్త రిలాక్స్ అయి వెనుదిరుగుతుండగా, నా ఎదురుగా హిల్లరీ! ఒక్కసారి షాక్ కు గురయ్యా. వెంటనే తేరుకుని ఆమెను ఆలింగనం చేసుకున్నా. బిల్ క్లింటన్ కూడా పక్కనే ఉన్నారు. కుక్కపిల్లను పట్టుకుని ఇద్దరూ వాహ్యాళికి వచ్చినట్టున్నారు. హిల్లరీ మేడం నన్ను ఓదార్చింది. లైఫ్ మస్ట్ గో ఆన్ తరహా మాటలతో ఊరటనిచ్చింది. ఎక్కువసేపు వాళ్ల సమయం తీసుకోకుండా నమస్కారం చెప్పా’ అని తెలిపింది.