: ఒకే ఒక్క బుల్లెట్ తో నడిసంద్రంలో బోటును ఆపేశాడు!!
మాదకద్రవ్యాల స్మగ్లింగ్ రోజురోజుకీ పెరిగిపోతుండడంతో అమెరికాలో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. దీంతో వందల కోట్ల విలువైన కొకైన్ తో ఓ బోటు కరీబియన్ సముద్రంలో ప్రయాణిస్తోందని, దానిలో సుమారు వెయ్యి కేజీల కొకైన్ ఉందని అమెరికా నావికాదళానికి యాంటీ డ్రగ్ పోలీసులు సమాచారం అందించారు. దీంతో సుశిక్షితులైన సిబ్బందితో ఆ బోటును లినిక్స్ హెలీకాప్టర్ లో నావికాదళం వెంబడించింది. బోటును సమీపించిన నావికాదళ సిబ్బంది, దానిని ఆపమని హెచ్చరిస్తూ బోటు చుట్టూ బుల్లెట్ల వర్షం కురిపించారు. అయినా స్మగ్లర్లు పట్టించుకోలేదు. దీంతో హెలికాప్టర్ నుంచి ఓ మెరీన్ స్నైపర్ గురి చూసి ఇంజన్ పై కాల్చాడు. అంతే, బ్రేక్ వేసినట్టు బోటు ఠపీమని ఆగిపోయింది. అనంతరం హెలికాప్టర్ ను అనుసరిస్తూ వచ్చిన కోస్టు గార్డులు ఆ బోటులోకి చేరుకొని 350 కేజీల కొకేన్ ను స్వాధీనం చేసుకున్నారు. వారు వచ్చేసరికే స్మగ్లర్లు 650 కేజీల కొకేన్ ను సముద్రుడిపాలు చేసినట్టు తెలుస్తోంది. అయితే కోస్టుగార్డులు స్వాధీనం చేసుకున్న కొకేన్ విలువ సుమారు వంద కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా, ఈ ఆపరేషన్ మొత్తం పూర్తయ్యేందుకు సుమారు ఆరు గంటల సమయం పట్టిడం విశేషం.