: పెద్దనోట్ల రద్దు ప్రభావం: 40 వేల నాణేలతో బిల్లు కట్టిన వ్యక్తి.. షాకై పోయిన ఆసుపత్రి సిబ్బంది!
పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో 500, 1000 రూపాయలు తీసుకోమని చెప్పిన ఓ ఆసుపత్రికి ఓ వ్యక్తి 40 వేల రూపాయలను నాణేల రూపంలో చెల్లించిన ఘటన కోల్‌కతాలో చోటుచేసుకుంది. కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న సుకంత చౌ అనే యువతి రెండు రోజుల క్రితం డిశ్చార్జి కావాల్సి ఉండగా, వారికి ఆసుపత్రి రూ.40,000 బిల్లు వేసింది. అయితే, ఆమె బంధువు వద్ద అన్నీ 500, 1000 రూపాయల నోట్లే ఉన్నాయి. ఆసుపత్రి సిబ్బంది వాటిని తీసుకోమని చెప్పేశారు. అతడి వద్ద క్రెడిట్ కార్డు కూడా లేకపోవడంతో చెక్కు రూపంలో బిల్లు చెల్లిస్తానని చెప్పాడు. అయితే, దానికి కూడా సిబ్బంది ససేమిరా అన్నారు. దీంతో ఆయన తన బంధువుని ఆసుపత్రి నుంచి తీసుకురావడానికి డబ్బు కావాలంటూ తన బంధువులకి, తెలిసిన వారికి వాట్సప్‌లో మెసేజ్‌లు పెట్టాడు. స్పందించిన ఆయన బంధువులు వారి వారి పిల్లల కిడ్డీ బ్యాంకుల్లోనూ, ఇళ్లలోనూ దాచుకున్న చిల్లర అంతా తీసి మొత్తం రూ.40,000 నాణేలు ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఒక్కసారిగా అంత చిల్లర చూడగానే షాకై పోయిన ఆసుపత్రి సిబ్బంది చిల్లర తీసుకోమని చెప్పారు. అతడిని డీడీ ఇవ్వాలని కోరారు. ఇంత కష్టపడి డబ్బు తీసుకొస్తే తీసుకోరా? అని అతడి బంధువులు సిబ్బందితో వాగ్వాదానికి దిగి, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. దీంతో ఆసుపత్రి యాజమాన్యం ఆ చిల్లర డబ్బులే తీసుకుంది.