: పెద్ద నోట్లు డిపాజిట్ చేయడానికి వెళ్లి బ్యాంక్‌పై నుంచి కిందపడిపోయిన వ్యక్తి.. మృతి
నల్లధనాన్ని అరికట్టేందుకు 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ప్రజలు తమ వద్ద ఉన్న డబ్బుని బ్యాంకుల్లో జమ చేసుకునేందుకు వెళుతున్నారు. అయితే, బ్యాంకుల వద్ద ఉన్న రద్దీ వారిని ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తోంది. బ్యాంకులో డబ్బును డిపాజిట్ చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తి మరణించిన ఘటన కన్నూరులో చోటుచేసుకుంది. కేరళ విద్యుత్ శాఖ ఉద్యోగి అయిన ఉన్ని (48) తన వద్ద ఉన్న రూ.5.5 లక్షల పెద్దనోట్లను బ్యాంక్‌లో వేసేందుకు నిన్న కన్నూరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్‌కు వెళ్లాడు. అయితే, బ్యాంకు వద్ద జనం బారులు తీరి ఉండడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. మళ్లీ ఈ రోజు బ్యాంకుకు వచ్చాడు. బ్యాంక్ ఉన్న భవనం మూడో అంతస్తులో ఉండడంతో పైకి ఎక్కాడు. అయితే, అక్కడి నుంచి ఒక్కసారిగా కిందకు పడి మృతి చెందాడు. ఆయన దగ్గర ఉన్న బ్యాగ్‌లో 5.5 లక్షల రూపాయల మొత్తంతో కూడిన 500, 1000 రూపాయల నోట్లు ఉన్నాయని, అయితే, ఉన్ని ప్రమాదవశాత్తు కిందపడి మరణించాడా? ఆత్మహత్య చేసుకున్నాడా? అనే అంశం తెలియాల్సి ఉంది.