: స్పూన్ తో పొడిచి సాటి ఖైదీని హత్య చేసిన మరో ఖైదీ.. మైసూరులో కలకలం!
చెంచాతో ఓ ఖైదీ మరో ఖైదీని హతమార్చిన ఘటన కర్ణాటకలోని మైసూరులో కలకలం రేపుతోంది. స్కెచ్ ప్రకారం ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్న ఓ ఖైదీ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే... కిరణ్ శెట్టి అనే 29 ఏళ్ల వ్యక్తి ఓ హత్యకేసులో మైసూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. సదరు జైలులో మొహమ్మద్ ముస్తఫా (31)అనే మరో ఖైదీతో కిరణ్‌కి గొడవలున్నాయి. గత ఏడాది దక్షిణ కన్నడ జిల్లాలో ఓ హత్య జరిగిన తర్వాత నుంచీ వీరిద్దరి మధ్య ఘర్షణ చెలరేగుతోంది. ఆ పగతోనే రగిలిపోతోన్న కిరణ్ ఇటీవలే జైలు కిచెన్ నుంచి చెంచాను చోరీ చేశాడు. అనంతరం దాన్ని నేలకు రుద్ది సన్నటి ఆయుధంగా తయారు చేసుకున్నాడు. అదును కోసం ఎదురు చూస్తోన్న కిరణ్.. ముస్తఫా జైలు నుంచి జైలులోని ప్రాథమిక చికిత్సాకేంద్రం వైపుకు వెళ్లడానికి సిద్ధమవడాన్ని గమనించాడు. తనకు ఒంట్లో బాగోలేదని పోలీసులకి చెప్పడంతో ఆయనను కూడా ముస్తఫాతో కలిపి ఆసుపత్రికి తరలించారు. ఇదే సమయంలో ముస్తఫా ముఖం, మెడ, ఛాతిపై కిరణ్ చెంచాతో విచక్షణారహితంగా దాడి చేశాడు. రక్తపుమడుగులో కొట్టుకుంటున్న ముస్తఫా తనను ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందాడు. ఈ ఘటన మైసూరులో కలకలం రేపింది. ముస్తఫాను మైసూరు మెడికల్ కాలేజీ మార్చురీ వద్దకు తరలించారన్న విషయం తెలుసుకున్న అతడి బంధువులు అక్కడకు పెద్ద ఎత్తున చేరుకొని, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొనే హత్యలు చేస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే ఆ రాష్ట్రంలో టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు నిర్వహించాలని కొందరు చూస్తోన్న నేపథ్యంలో తాజాగా జరిగిన ఈ హత్య అలజడి రేపుతోంది మైసూరులోని పలు ప్రాంతాల్లో నిఘాను పెంచామని అక్కడి పోలీసు అధికారులు చెప్పారు. ఈ హత్యకేసుపై విచారణ జరిపి నిజానిజాలు తెలుసుకుంటామని పేర్కొన్నారు.