: వెంటాడుతున్న జింకల కేసు.. సల్మాన్ ఖాన్ కు నోటీసులు పంపిన సుప్రీంకోర్టు
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ ను రాజస్థాన్ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, హైకోర్టు తీర్పును రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కేసు వివరాల్లోకి వెళ్తే, 1998లో ఓ సినిమా షూటింగ్ సమయంలో రెండు జంతువులను సల్మాన్ చంపినట్టు కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి 2007లో, ఓ కేసులో ఏడాది, మరో కేసులో ఐదేళ్ల జైలు శిక్షను కింది కోర్టు విధించింది. దీంతో, ఓ వారం పాటు జోధ్ పూర్ కోర్టులో కూడా సల్మాన్ గడిపాడు. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు. ఈ కేసును విచారించిన హైకోర్టు... జింకల కళేబరాల నుంచి తీసిన బుల్లెట్లు సల్మాన్ తుపాకీ నుంచి పేల్చినవి కాదని భావించి, ఈ ఏడాది జులై 25న ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది. దీంతో, చట్టంలోని లోపాలతోనే సల్మాన్ నిర్దోషిగా విడుదలయ్యాడని... హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరుతూ, ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం గడప తొక్కింది. ఈ క్రమంలోనే, సల్మాన్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.