: ఏటీఎంలలో పెట్టిన వెంటనే అయిపోతున్న డబ్బులు.. ప్రజల ఇక్కట్లు
దేశ వ్యాప్తంగా ప్రజలకు చిల్లర కష్టాలు తప్పడం లేదు. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటన చేసినప్పటి నుంచి ఆందోళన పడుతున్న జనాలు ఈ రోజు ఏటీఎంలు అందుబాటులోకి వస్తాయని వచ్చిన వార్తలతో ఏటీఎం సెంటర్ల ముందు బారులు తీరుతున్నారు. అయితే దేశ వ్యాప్తంగా ఎన్నో ఏటీఎం సెంటర్లు ఇంకా తెరచుకోలేదు. పలు ఏటీఎం కేంద్రాల్లో నాట్ వర్కింగ్, నో సర్వీస్ అని బోర్డులు కనిపిస్తున్నాయి. కొన్ని ఏటీఎం సెంటర్లు మాత్రమే పనిచేస్తున్నాయి. అయితే, వాటిల్లో అన్నీ వంద, యాభై రూపాయల నోట్లే పెట్టడంతో వినియోగదారులు ఏటీఎంల నుంచి రెండు వేల చొప్పున తీసుకుంటున్నారు. దీంతో ఏటీఎంలలో ఉంచిన డబ్బంతా కొద్ది సేపటికే అయిపోతోంది. ఎంతో మంది వినియోగదారులు ఏటీఎం సెంటర్లకు రావడం, నిరాశగా వెనుతిరగడం కనిపిస్తోంది. ఏటీఎంలలో పెట్టిన వెంటనే డబ్బులు అయిపోతుండడంతో బ్యాంకు అధికారులు మళ్లీ ఏటీఎంలను డబ్బుతో నింపాలంటే తలలు పట్టుకుంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లోని ఏటీఎంలు సాంకేతిక సమస్యల కారణంగా పనిచేయడం లేదు. కొత్త 2000 నోట్లను పెట్టడానికి సాఫ్ట్‌వేర్ మార్చాల్సి రావడంతో కొన్ని ఏటీఎంలు పనిచేయడం లేదు. దేశవ్యాప్తంగా మొత్తం దాదాపు 2 లక్షల ఏటీఎంలు ఉన్నాయి. అయితే వాటిల్లో ఇప్పటివరకు సుమారు 50 వేల మిషన్లలో పాతనోట్లే ఉన్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. ఓ వైపు బ్యాంకుల్లో.. మరోవైపు ఏటీఎంలలోనూ జనాలు బారులు తీరి కనిపిస్తుండడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.