: కొత్త నోట్లింకా రాలేదు... దయచేసి ఏటీఎంలకు రావద్దు: బ్యాంకర్లు
అన్ని ఏటీఎం కేంద్రాల్లో నింపేందుకు సరిపడా కొత్త కరెన్సీ నోట్ల సరఫరా ఇంకా కాలేదని బ్యాంకర్లు స్పష్టం చేశారు. ప్రజలు, ఖాతాదారులు హడావుడి పడి తమ విలువైన సమయాన్ని ఏటీఎం కేంద్రాల వద్ద క్యూల్లో నిలబడి వృథా చేసుకోవద్దని సూచించారు. ఈ సాయంత్రానికి 20 శాతం ఏటీఎం కేంద్రాలు తెరచుకోవచ్చని, రేపటికి సగం ఏటీఎంలు, సోమవారం నాటికి అన్ని ఏటీఎంలు తెరచుకుంటాయని ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కొత్త నోట్ల ముద్రణ శరవేగంగా సాగుతోందని, ముద్రితమైన నోట్లు ముద్రితమైనట్టు బ్యాంకుల చేతికి బట్వాడా అవుతున్నాయని తెలిపారు. కాగా, ఈ ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో ఏటీఎంల వద్ద కిలోమీటర్ల కొద్దీ కస్టమర్ల క్యూలైన్లు కనిపిస్తుండగా, మధ్యాహ్నం అయినా, తెరచుకున్న ఏటీఎంల సంఖ్య వేళ్ల మీద లెక్కించేంత మాత్రమే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రెండో రోజు కూడా బ్యాంకుల్లో కస్టమర్ల క్యూ కొనసాగుతోంది.