: నేను సన్యానం తీసుకోవాలని అనుకోవడానికి కారణాలివే!: పవన్ కల్యాణ్
తాను కాలేజీలో చదువుతున్న సమయంలో పుస్తకాల్లో చదివి తెలుసుకున్న విషయాలకు, బయటి ప్రపంచంలో జరుగుతున్న దానికి ఎంతమాత్రమూ పొంతన ఉండేది కాదని, ఈ పరిస్థితిని చూసి తనలో తానే మధనపడి పోయేవాడినని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఒంటరిగా కూర్చుండిపోయేవాడినని, ఒక్కో దశలో సన్యాసం తీసుకోవాలని, అన్నీ వదిలేసి ఎక్కడికో వెళ్లిపోవాలన్న ఆలోచన మనసును గట్టిగా పట్టుకుని ఉండేదని అన్నారు. తన స్కూల్ క్యాంపస్ లో దేశభక్తి పాటలు పెట్టేవారని, తాను మ్యాథమేటిక్స్, ట్రిగనామెట్రీ, కాలిక్యులస్ నేర్చుకోలేదని, పాటలు వింటూ దేశభక్తిని మాత్రం పెంచుకున్నానని చెప్పారు. ఆ పాటలు తననెంతో ప్రభావితం చేశాయని అన్నారు. "సోషల్ పుస్తకాల్లో మన ఇల్లు, మన బడి, మన ఊరు అంటూ బాగుండేది, గాంధీగారు అలా చెప్పారు, ఇలా చెప్పారు అంటూ... సుభాష్ చంద్రబోస్ గారిట్లా అని. వాస్తవానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ అన్యాయానికి, దోపిడీకి గురవుతుండేవాళ్లు. నాకు అర్థమయ్యేది కాదు. అందుకే ఎవరితోనూ మాట్లాడకుండా ఒక్కడినే కూర్చునేవాడిని. అదే నా మనసులో సన్యాసిగా మారాలన్న ఆలోచనకు కారణమైంది" అన్నారు.