: నోట్ల రద్దు తరువాత తొలిసారి ప్రజలకు మోదీ విజ్ఞప్తి
పెద్దనోట్లను రద్దుచేస్తూ మంగళవారం రాత్రి ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన తరువాత తొలిసారిగా తన అభిప్రాయాన్ని పంచుకుంటూ ప్రజలకు కొన్ని విజ్ఞప్తులు చేశారు. జపాన్ బయలుదేరిన ఆయన, తన ట్విట్టర్ ఖాతా ద్వారా సందేశాన్నిచ్చారు. అవినీతిని రూపుమాపేందుకు తాము కృతనిశ్చయంతో ఉన్నామని, ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలను అందించాలన్నదే తన అభిమతమని చెప్పారు. ప్రజలు ఎంతో ఓపికతో పాత నోట్లను బ్యాంకులకు తీసుకెళ్లి మార్చుకుంటున్నారని, వారి స్పందన తనకెంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు. కొంతమంది వయో వృద్ధులు నోట్లను మార్చుకునేందుకు వచ్చిన వేళ, వారిని ముందు పంపించేందుకు సహకరిస్తున్న ప్రజల దృశ్యాలు తన హృదయాన్ని తాకాయని అన్నారు. ప్రజలు ఒకేసారి బ్యాంకులకు వెళ్లవద్దని, తమ వీలును బట్టి డిసెంబర్ 30 వరకూ ఎప్పుడైనా వెళ్లి డబ్బు డిపాజిట్ చేయవచ్చని చెప్పారు. ప్రజలు త్వరపడి తమ విలువైన సమయాన్ని బ్యాంకుల వద్ద వృథా చేసుకోవద్దని, అత్యవసరమైతేనే ఇప్పటికిప్పుడు బ్యాంకులకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు.