: బ్యాంకుల్లో పెరుగుతున్న 'దొంగ' క్యూలు... చెక్ పెట్టారిలా!
తమ వద్ద ఉన్న పాత కరెన్సీ నోట్లను సాధ్యమైనంత త్వరగా మార్చుకోవాలన్న తొందరలో ఉన్న ప్రజలు, బ్యాంకుల వద్ద గంటల కొద్దీ క్యూలో నిలబడుతున్న సంగతి తెలిసిందే. రోజుకు ఒక్కొక్కరికీ రూ. 4 వేల వరకూ మాత్రమే కొత్త నోట్లు ఇస్తామని బ్యాంకులు స్పష్టం చేసిన వేళ, మరింత డబ్బు కోసం ఒకసారి డబ్బు మార్చుకున్న వారు తిరిగి క్యూలోకి రావడం మొదలు పెట్టారు. దాదాపు అన్ని బ్యాంకుల వద్దా ఇదే తీరు కనిపించడంతో, ఈ దొంగ క్యూలను అరికట్టేందుకు అధికారులు ఓ ప్లాన్ వేశారు. హైదరాబాదులో ఈ ఉదయం నుంచి బ్యాంకుకు నోట్ల మార్పిడికి వస్తున్న వారి వేలిపై సిరా చుక్క వేస్తున్నారు. అంటే, ఇక వారు ఈ రోజుకు బ్యాంకుకు రాలేరు. మరింత మందికి అవకాశం ఇవ్వడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.