: అమెరికా నుంచి విడిపోతామంటున్న కాలిఫోర్నియా... టెక్సాస్‌ దీ అదే మాట


అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడం చాలా మంది అమెరికన్లకు ఆవేదన మిగిల్చింది. ట్రంప్ తమ అధ్యక్షుడు కాదంటూ పలు చోట్ల నిరసన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మరోవైపు, డెమొక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కు ఎక్కువ ఓట్లు వచ్చిన కాలిఫోర్నియా రాష్ట్రంలో నిరసనలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. ఎప్పటి నుంచో ఉన్న వేర్పాటువాదం ఇప్పుడు మరింత తీవ్రతరమవుతోంది. అమెరికా నుంచి కాలిఫోర్నియా విడిపోవాలని అక్కడ చాలా మంది భావిస్తున్నారు. 'ఎస్ కాలిఫోర్నియా' అనే బృందం దీనికి సంబంధించి బుధవారం నాడు ఓ కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. 2020 నాటికల్లా అమెరికా నుంచి విడిపోయి, కొత్త దేశంగా కాలిఫోర్నియా ఆవిర్భవించడమే తమ లక్ష్యమని ఆ సందర్భంగా వారు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాలిఫోర్నియా అని... ఫ్రాన్స్ కంటే కాలిఫోర్నియానే శక్తిమంతమైనదని... పోలండ్ దేశం కంటే కాలిఫోర్నియా జనాభానే ఎక్కువని వారు అంటున్నారు. కాలిఫోర్నియా దేశాలతో పోటీపడుతుందే కాని... అమెరికాలోని మిగిలిన 49 రాష్ట్రాలతో కాదని చెబుతున్నారు. కాలిఫోర్నియా విలువలతో సంఘర్షించే విధానాలను అమెరికా ప్రభుత్వం అమలు చేస్తోందని వారు మండిపడుతున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వెలుపలకు రావడాన్ని 'బ్రెగ్జిట్' అంటున్నారు. ఇదే విధంగా అమెరికా నుంచి కాలిఫోర్నియా బయటకు రావాలనుకుంటున్న దాన్ని 'కాల్ ఎగ్జిట్'గా ఆ రాష్ట్ర ప్రజలు పిలుచుకుంటున్నారు. మరోవైపు... యూఎస్ నుంచి టెక్సాస్‌ రాష్ట్రం కూడా విడిపోవాలనుకుంటోంది. దీన్ని 'టెగ్జిట్' గా పిలుస్తున్నారు.

  • Loading...

More Telugu News